నేటి నుంచి జాతీయ మహిళల హాకీ టోర్నీ
• బరిలో 28 జట్లు
• మార్చి 12న ఫైనల్
పంచ్‌కులా: సీనియర్ మహిళల జాతీయ హాకీ చాంపియన్‌షిప్‌ను కొత్త ఫార్మాట్‌లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 12 వరకు హరియాణాలోని పంచ్‌కులాలో ఈ మెగా టోర్నీ జరుగనుంది. మొత్తం 28 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో ఈ 28 జట్లు ఎ, బి, సి గ్రూపుల్లో తలపడతాయి. ఈ తాజా ప్రదర్శనే ప్రామాణీకంగా తదుపరి సీజన్ గ్రూపుల్లో జట్లు మారతాయి. అంటే రంజీ క్రికెట్ తరహాలో రాష్ట్ర హాకీ జట్లు మూడు గ్రూపులుగా విభజించి నిర్వహిస్తారు.
తద్వారా ఉత్తమ, మధ్యమ, అధమ స్థాయి జట్ల మధ్య పోటీలు జరుగుతాయి. సిలో చిన్న జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిస్తే మధ్యమ స్థాయి ‘బి’కి… తర్వాత ఉత్తమ స్థాయి ‘ఎ’కి ఆయా జట్లకు ప్రమోషన్ లభిస్తుంది. తద్వారా బలమైన జట్టుతో బలహీనమైన జట్టు పోటీపడదు. సమఉజ్జీల మధ్యే సమరం జరగడం వల్ల పోటీ వాతావరణం క్రమంగా పెరిగి ఆయా జట్లు పురోగతి సాధిస్తాయని ‘హాకీ ఇండియా’ భావిస్తోంది.
ఈసారి తెలుగు రాష్ట్రాల జట్లకు ‘ఎ’ డివిజన్‌లో పోటీపడే అవకాశం లభించలేదు. తెలంగాణ ‘బి’ డివిజన్‌లోని పూల్ ‘ఎ’లో ఉన్న ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్తాన్, బిహార్‌లతో తలపడుతుంది. ‘సి’ డివిజన్‌లోని పూల్ ‘బి’లో ఉన్న ఆంధ్రప్రదేశ్… పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లతో పోటీ పడుతుంది.
‘ఎ’ డివిజన్‌లో…
పూల్ ‘ఎ’: హరియాణా, ఒడిశా, కర్ణాటక; పూల్ ‘బి’: మహారాష్ట్ర, మణిపూర్, పంజాబ్; పూల్ ‘సి’: జార్ఖండ్, మిజోరం, తమిళనాడు; పూల్ ‘డి’: మధ్యప్రదేశ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్.
‘బి’ డివిజన్‌లో…
పూల్ ‘ఎ’: తెలంగాణ, ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్తాన్, బిహార్; పూల్ ‘బి’: ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్.
‘సి’ డివిజన్‌లో…
పూల్ ‘ఎ’: కేరళ, దాద్రా నాగర్ హవేలి, డామన్ అండ్ డియూ, గుజరాత్; పూల్ ‘బి’: ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్.