Search for:
  • Home/
  • Breaking/
  • క్రీడలకు ఆస్తులతో పనేంటి?

క్రీడలకు ఆస్తులతో పనేంటి?

 • ఆటలు మంచి అవకాశాలు అందిస్తాయి
 • భారత వాలీబాల్‌ మాజీ ప్లేయర్‌, పీవీ సింధు తండ్రి పీవీ రమణ  

న్యూఢిల్లీ: క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించే ముందు మధ్య తరగతి వర్గాల వారు తీవ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని… ఆర్థికపరంగా మంచి స్థాయిలో ఉన్నవారి పిల్లలే ఆటల వైపు రావాలంటూ భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు గోపీచంద్‌ మాటలతో ఏకీభవిస్తుండగా, మరికొందరు వాటిని తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వాలీబాల్‌ క్రీడాకారుడు, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తండ్రి పీవీ రమణ దీనిపై స్పందించారు.

ఆటగాడిగా ఎదిగేందుకు ధనవంతులు కావడం ముఖ్యం కాదని… ప్రతిభ ఉంటే దూసుకుపోవచ్చని అభిప్రాయపడ్డారు. తానూ దిగువ స్థాయి నుంచే వచ్చి ఆటగాడిగా ఎదిగానని… సింధును క్రీడల వైపు మళ్లించినప్పుడు కూడా తన వద్ద పెద్దగా డబ్బేమీ లేదని ఆయన స్వీయానుభవాన్ని పంచుకున్నారు. ‘నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. 10 మంది సంతానంలో నేను అందరికంటే చిన్నవాడిని. కానీ అన్నలు, అక్కలు నాకు ఎంతో అండగా నిలిచి జాతీయ స్థాయిలో వాలీబాల్‌ ఆడేందుకు సహకరించారు.

ఆట కారణంగానే నాకు రైల్వేస్‌లో ఉద్యోగం వచ్చింది. మీరు దిగువ మధ్య తరగతి లేదా మధ్య తరగతికి చెందినా… ఆటల్లో మంచి ప్రదర్శన కనబరిస్తే ఎన్నో అవకాశాలు వస్తాయి. చిన్నారులు అన్ని రకాలుగా ఎదిగేందుకు కూడా క్రీడలు ఉపయోగపడతాయి’ అని రమణ వివరించారు. 1986 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో రమణ సభ్యుడిగా ఉన్నారు. తన పెద్ద కూతురు చదువులో చురుగ్గా ఉందని ఆమెను డాక్టర్‌ అయ్యేలా ప్రోత్సహించానని, సింధుకు బ్యాడ్మింటన్‌లో ఎంతో ప్రతిభ ఉందనే విషయం ఆరంభంలో గుర్తించామని ఆయన అన్నారు.

‘ప్రతిభ ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తుంది. దానిని ఎవరూ దాచి ఉంచలేరు. తల్లిదండ్రులు తగిన రీతిలో మార్గనిర్దేశనం చేయాలి. ఒక క్రీడాకారుడు మరొకరిని క్రీడల్లోకి రావద్దంటూ హెచ్చరించడం సరైంది కాదని నా అభిప్రాయం’ అని గోపీచంద్‌ వ్యాఖ్యలను రమణ వ్యతిరేకించారు. తనకు రైల్వేలో ఉద్యోగం ఉండటం వల్లే సింధు కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లగలిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘క్రీడల ద్వారా ఉద్యోగం తెచ్చుకోవడం మధ్యతరగతి వారి దృష్టిలో పెద్ద ఘనత. అలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

రైల్వేలోనే వేలాది మంది క్రీడాకారులు ఉద్యోగాలు చేస్తున్నారు. స్పోర్ట్స్‌ కోటాలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో పెద్ద చదువులు చదివే అవకాశం కూడా లభిస్తుంది. కోచ్‌లు ఈ విషయంలో వారికి సరైన దారి చూపిస్తే చాలు’ అని రమణ పేర్కొన్నారు. ఇటీవల ఒక యువ షట్లర్‌కు ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం లభించే విధంగా తాను తగిన విధంగా మార్గనిర్దేశనం చేసినట్లు రమణ వెల్లడించారు.

డబ్బున్న వారే ఆటల్లోకి రావాలంటూ సూచించడం సరైంది కాదని ఆయన అన్నారు. సింధు కెరీర్‌ ఆరంభంలో తాము రైలు ప్రయాణాలు చేస్తే కొందరు విమానాల్లో వచ్చేవారని… ఇప్పుడు సింధు ఏ స్థాయికి చేరుకుందో చూడాలని రమణ వ్యాఖ్యానించారు.