జొకోవిచ్‌పై ‘ఆఖరి సవాల్’ గెలిచి…
టెన్నిస్‌కు డెల్ పొట్రో వీడ్కోలు
• గాయాలతో నిలకడలేమి
• కెరీర్‌లో 22 టైటిల్స్ హస్తగతం
2009లో నాదల్, ఫెడరర్‌లను ఓడించి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సొంతం
బ్యూనస్‌ఎయిర్స్ (అర్జెంటీనా): శక్తివంతమైన సర్వీస్‌లకు పెట్టింది పేరు… బుల్లెట్‌లా దూసుకుపోయే ఫోర్‌హ్యాండ్ షాట్‌లు… ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తన వైపునకు తిప్పుకోగల సమర్థుడు… 97 కేజీల బరువు… 6 అడుగుల 6 అంగుళాల ఆజానుబాహుడు… అతనే అర్జెంటీనా వెటరన్ టెన్నిస్ స్టార్ యువాన్ మార్టిన్ డెల్ పొట్రో. ఎంతో సత్తా ఉన్నా గాయాల కారణంగా కెరీర్‌ను కొనసాగించలేక ఎట్టకేలకు ఆటకు టాటా చెప్పేశాడు.
సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో చివరి మ్యాచ్‌లో టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్‌పై గెలిచి డెల్ పొట్రో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మాజీ ప్రపంచ మూడో ర్యాంకర్ డెల్ పొట్రో 6–4, 7–5తో వరుస సెట్లలో సెర్బియా దిగ్గజంపై గెలిచాడు.
‘ది లాస్ట్ చాలెంజ్’ (ఆఖరి సవాల్) పేరిట జరిగిన ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు అర్జెంటీనా మహిళా టెన్నిస్ స్టార్ గాబ్రియేలా సబటినితోపాటు పలువురు సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు విచ్చేశారు. దీంతో వీడ్కోలుకు వేదికైన పార్కే రోకా స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతిమ సమరంలో విజయానంతరం అభిమానులు, ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య డెల్ పొట్రో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
కోర్టులో నెట్‌ను ముద్దాడాడు. చెమర్చిన కళ్లతో వున్న అర్జెంటీనా స్టార్‌ను అనునయిస్తూ జొకోవిచ్ అభినందించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘యువాన్‌ను ప్రేమించని వారంటూ ఉండరు. అందరు అభిమానించే ఆటగాడు అతను. అతని జీవితంలో అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే అది అతని వ్యక్తిత్వమే’ అని 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్ల విజేత, ఆల్‌టైమ్ గ్రేటెస్ట్‌లలో ఒకడైన సెర్బియన్ సూపర్‌స్టార్ డెల్ పొట్రోను ఆకాశానికెత్తాడు.
2009లో జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)లను వరుసగా సెమీఫైనల్, ఫైనల్లో ఓడించిన డెల్‌పొట్రో తన కెరీర్లోనే ఏకైక గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. కానీ గాయాలు అతన్ని కుదురుగా ఆడనివ్వలేకపోవడంతో కెరీర్ అసాంతం ఫిట్‌నెస్ సమస్యలతోనే సతమతమయ్యాడు. అతను చివరిసారిగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ ఆడాడు. ఓవరాల్‌గా 22 టైటిళ్లను గెలుచుకున్నాడు.
36 ఏళ్ల డెల్ పొట్రో కెరీర్‌లో రెండు ఒలింపిక్ పతకాలు కూడా ఉన్నాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన డెల్ పొట్రో 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2016లో పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ‘డేవిస్ కప్’ టైటిల్ అర్జెంటీనాకు దక్కడంలో డెల్ పొట్రో కీలకపాత్ర పోషించాడు.
మిగతా గ్రాండ్‌స్లామ్ టోర్నీల విషయానికొస్తే… రెండుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో (2009, 2012)… రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో (2009, 2018) క్వార్టర్ ఫైనల్ వరకు చేరాడు. వింబుల్డన్ టోర్నీలో (2013) ఒకసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.
3 డెల్ పొట్రో సాధించిన కెరీర్ బెస్ట్ ర్యాంక్. 2018లో అత్యుత్తమంగా మూడో స్థానానికి చేరుకున్నాడు.
439 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్‌లో డెల్ పొట్రో గెలిచిన మ్యాచ్‌లు.
174 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్‌లో డెల్ పొట్రో ఓడిన మ్యాచ్‌లు.
4418 డెల్ పొట్రో తన కెరీర్‌లో సంధించిన ఏస్‌లు.
2,58,96,046 డాలర్లు (రూ. 219 కోట్లు) డెల్ పొట్రో కెరీర్‌లో సాధించిన మొత్తం ప్రైజ్‌మనీ