Search for:
  • Home/
  • Breaking/
  • పాకిస్తాన్‌కు వస్తారా? లేదా?..

పాకిస్తాన్‌కు వస్తారా? లేదా?..

ఏదో ఒకటి చెప్పండి! రాకపోతే మాత్రం..

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై వచ్చే వారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారత జట్టు దాయాది దేశానికి వెళ్లకుంటే.. ఏం చేయాలన్న విషయంపై కూడా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో పాక్‌ పర్యటన విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలంటూ ఐసీసీతో పాటు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐ నుంచి రాతపూర్వక సమాధానం కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

భద్రతా కారణాల దృష్ట్యా..
కాగా 2008 తర్వాత భారత క్రికెట్‌ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోగా.. మెగా టోర్నీల్లో మాత్రం దాయాదులు ముఖాముఖి తలపడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు కలుగుతోంది.

అప్పుడు శ్రీలంకలో
అయితే, ఆసియా వన్డే కప్‌-2023 హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకోగా.. బీసీసీఐ మాత్రం రోహిత్‌ సేనను అక్కడికి పంపలేదు. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించాలని కోరగా.. ఆసియా క్రికెట్‌ మండలి అందుకు అంగీకరించింది. దీంతో టీమిండియా మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగాయి.ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్‌-2023 భారత్‌లో జరుగగా.. పాక్‌ జట్టు ఇక్కడికి వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో ఘోర ఓటమితో కనీసం సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఈసారి చాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య హక్కులు తమవే గనుక.. టీమిండియా తమ దేశానికి రావాలని పీసీబీ కోరుతోంది.అయితే, బీసీసీఐ నేరుగా ఈ విషయాన్ని ఖండించలేదు. భారత ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా తాము అడుగులు వేస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఇప్పటికే స్పష్టం చేశాడు.

✿ రాతపూర్వక సమాధానం ఇవ్వండి..
అయితే, వచ్చే ఏడాది జరుగనున్న ఈ టోర్నీకి సిద్ధమవుతున్న పీసీబీ.. టీమిండియా తమ దేశానికి వస్తుందో? రాదో అన్న అంశంపై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. ఐసీసీ సైతం ఈ విషయం గురించి బీసీసీఐని అడిగిందని.. ఒకవేళ భారత బోర్డు నుంచి సమాధానం రాకపోతే వచ్చే వారం చాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని చెప్పినట్లు పాక్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

✿ ఒకవేళ టీమిండియా పాకిస్తాన్‌కు రాకపోతే మాత్రం,,
ఇక టీమిండియా మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహిస్తామని పాక్‌ బోర్డు చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ ఇప్పటికే చెప్పాడు. ఇదిలా ఉంటే.. బీసీసీఐ తమ జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యామ్నాయ వేదిక కోసం ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బడ్జెట్‌ నుంచి కొంతమొత్తం పక్కన పెట్టినట్లు సమాచారం. ఇక ఐసీసీ చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా డిసెంబరు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది.