Search for:
  • Home/
  • Breaking/
  • ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే..!

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే..!

అక్టోబర్‌ నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వివరాలను ఐసీసీ ఇవాళ (నవంబర్‌ 5) వెల్లడించింది. పురుషుల విభాగంలో పాక్‌ బౌలర్‌ నౌమన్‌ అలీ, న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌, సౌతాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ ఈ అవార్డుకు నామినేట్‌ కాగా.. మహిళల విభాగంలో టీ20 వరల్డ్‌కప్‌ టాప్‌ పెర్ఫార్మర్లు అమేలియా కెర్‌ (న్యూజిలాండ్‌), డియాండ్రా డొట్టిన్‌ (వెస్టిండీస్‌), లారా వోల్వార్డ్ట్‌ (సౌతాఫ్రికా) నామినేట్‌ అయ్యారు.

నౌమన్‌ అలీ: ఈ పాక్‌ వెటరన్‌ స్పిన్నర్‌ అక్టోబర్‌ నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నౌమన్‌ ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 13.85 సగటున 20 వికెట్లు పడగొట్టాడు.

కగిసో రబాడ: ఈ సౌతాఫ్రికన్‌ సీమర్‌ గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో వీర లెవెల్లో విజృంభించాడు. ఈ సిరీస్‌లో రబాడ టెస్ట్‌ల్లో 300 వికెట్ల మార్కును తాకాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రబాడ 14 వికెట్లు పడగొట్టి, ఐసీసీ టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు.

మిచెల్‌ సాంట్నర్‌: ఈ న్యూజిలాండ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అక్టోబర్‌ నెలలో భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో శివాలెత్తిపోయాడు. పూణే టెస్ట్‌లో సాంట్నర్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

డియాండ్రా డొట్టిన్‌: ఈ విండీస్‌ ఆల్‌రౌండర్‌ గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ మెగా టోర్నీలో డొట్టిన్‌ స్కాట్లాండ్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌పై విజయాల్లో కీలకపాత్ర పోషించింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో డొట్టిన్‌ నాలుగు వికెట్ల ప్రదర్శనతో పాటు కీలకమైన ఇన్నింగ్స్‌ (33 పరుగులు) ఆడినప్పటికీ.. విండీస్‌ ఓటమిపాలైంది.

అమేలియా కెర్‌: ఈ న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కెర్‌ ముఖ్యపాత్ర పోషించింది. ఈ టోర్నీలో కెర్‌ 135 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచింది.

లారా వోల్వార్డ్ట్‌: గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాను ఫైనల్‌కు చేర్చడంలో లారా కీలకపాత్ర పోషించింది. ఈ మెగా టోర్నీలో లారా లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా (44.60 సగటున 223 పరుగులు) నిలిచింది. వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో లారా కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది.