ఒలింపిక్ బెర్త్ నంబర్ 16
జకార్తా: ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఈసారి భారత్ నుంచి షూటింగ్ క్రీడాంశంలో అత్యధిక మంది పోటీపడనున్నారు. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి అత్యధికంగా 15 మంది షూటర్లు అర్హత పొందగా… ఈసారి ఆ సంఖ్య 16కు చేరుకుంది.
ఇంకా షూటింగ్‌లో మరో మూడు క్వాలిఫయింగ్ టోర్నీలు మిగిలి ఉండటం, మరో ఎనిమిది బెర్త్‌లు ఖాళీగా ఉండటంతో భారత్ నుంచి మరింత మంది షూటర్లు అర్హత సాధించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో గురువారం భారత్‌కు 16వ బెర్త్ ఖరారైంది.
మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రిథమ్ సాంగ్వాన్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో హరియాణాకు చెందిన 20 ఏళ్ల రిథమ్ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. రిథమ్, తెలంగాణ షూటర్ ఇషా సింగ్, సిమ్రన్‌ప్రీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 1743 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకుంది.