Search for:
  • Home/
  • Breaking/
  • ‘పారా’ విజేతలకు నజరానా

‘పారా’ విజేతలకు నజరానా

  - స్వర్ణం గెలిచిన వారికి రూ.75 లక్షలు
  - చెక్కులు అందజేసిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి

ఢిల్లీ: పారిస్‌ వేదికగా ఇటీవలే ముగిసిన పారాలింపిక్స్‌లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన విజేతలకు కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు ప్రకటించింది. ఈ క్రీడలలో భారత్‌ తరఫున బంగారు పతకం సాధించినవారికి రూ. 75 లక్షలు, వెండి వెలుగులు పంచినవారికి రూ. 50 లక్షలు, కాంస్యంతో మెరిసిన క్రీడాకారులకు రూ. 25 లక్షల నజరానా ప్రకటించింది. మిక్స్‌డ్‌ ఈవెంట్స్‌లో పతకాలు గెలిచిన ఆర్చర్లు రాకేశ్‌ కుమార్‌, శీతల్‌ దేవీకి తలా రూ. 22.5 లక్షల చొప్పున దక్కనుంది. ఈ మేరకు ఢిల్లీలో తనను కలిసిన పలువురు పారా అథ్లెట్స్‌ను సన్మానించిన అనంతరం కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సూఖ్‌ మాండవీయ వారికి చెక్కులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ.. ‘పారాలింపిక్స్‌లో భారత్‌ క్రమంగా పుంజుకుంటోంది. 2016లో 4 మెడల్స్‌ గెలిచిన దేశం.. టోక్యోలో 19 పతకాలు సాధించింది. తాజాగా దానిని 29కు చేర్చి పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది. పారా అథ్లెట్ల కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని వసతులూ కల్పిస్తోంది. 2028 లాస్‌ఏంజెల్స్‌ వేదికగా జరుగబోయే పారాలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధిస్తాం’ అని అన్నారు. పారాలింపిక్స్‌లో భారత్‌కు 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు దక్కిన విషయం (మొత్తం 29) తెలిసిందే.

✨వీరులకు ఘనస్వాగతం

పారాలింపిక్స్‌లో పాల్గొని పతకాల పంట పండించిన భారత పారా అథ్లెట్లు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఆదివారం నాటికి ఈ క్రీడలు ముగిసిన తర్వాత అక్కడ మిగిలిపోయిన భారత బృందం మంగళవారం ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వందలాదిగా చేరుకున్న అభిమానులు.. అథ్లెట్లపై పూలు చల్లుతూ, స్వీట్లు తినిపించుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పతక విజేతలతో కలిసి సెల్ఫీలు దిగారు. స్వదేశానికి చేరుకున్న వారిలో సుమిత్‌ అంటిల్‌, హర్విందర్‌ సింగ్‌, శీతల్‌ దేవీ, నవ్‌దీప్‌ వంటివాళ్లు ఉన్నారు.