2028లో మళ్లీ కలుద్దాం..!
- పారిస్‌లో విశ్వ క్రీడలకు వీడ్కోలు
- ఘనంగా సాగిన వేడుకలు
- బాణాసంచా వెలుగులతో జిగేల్
- లాస్‌ఏంజెలిస్‌లో 2028 ఒలింపిక్స్
పారిస్: ప్రపంచ సినిమా కలల ప్రపంచం హాలీవుడ్… లాస్‌ఏంజెలిస్ నగర శివారులో వెలసిన వినోదనగరి… నాలుగేళ్ల తర్వాత ఆ సినీ అడ్డా వద్ద ప్రపంచ క్రీడా సంబరం నిర్వహణకు రంగం సిద్ధమైంది… మరి దాని గురించి ప్రపంచానికి చెప్పాలంటే మామూలు పద్ధతిలో చేస్తే ఏం బాగుంటుంది? అందుకే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు కొత్తగా ప్రయత్నించారు. అందుకోసం హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్‌కంటే సరైన వ్యక్తి ఎవరుంటారు.
పారిస్ నేషనల్ స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ముగింపు ఉత్సవం మధ్యలో క్రూజ్ స్టేడియం పైభాగం నుంచి దూకి స్టేడియంలోకి వచ్చాడు. ఆ తర్వాత అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ నుంచి ఒలింపిక్ పతాకాన్ని అందుకున్నాడు. లాస్‌ఏంజెలిస్‌లో క్రీడలు జరిగే సమయంలో ప్రధానాకార్షణగా మారే అవకాశం ఉన్న టామ్ క్రూజ్‌ను ఇలా అందరి ముందు తీసుకొచ్చారు.
మోటార్ సైకిల్, విమానం, పారాచూట్‌తో టామ్ క్రూజ్ ఒలింపిక్స్‌కు ప్రచారం చేస్తూ గతంలోనే రికార్డు చేసిన వీడియోను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంతో అధికారికంగా ఒలింపిక్స్ నిర్వహణ బాధ్యత పారిస్ నుంచి లాస్ ఏంజెలిస్‌కు మారింది. ఈ అమెరికా నగరంలో ఒలింపిక్స్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 1932, 1984లో లాస్ ఏంజెలిస్‌లో విశ్వ క్రీడలు జరిగాయి.
అలరించిన కార్యక్రమాలు…
సెన్ నదిపై ఘనంగా నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకల తరహాలోనే ఒలింపిక్స్ ముగింపు ఉత్సవం కూడా ఘనంగానే ముగిసింది. దాదాపు 70 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో రెండున్నర గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. పారిస్ నగర ఘనతను చెబుతూ సాగిన సంగీత కార్యక్రమంతో ఇది మొదలు కాగా… అనంతరం 206 దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలతో పరేడ్‌లో పాల్గొన్నారు. ‘రికార్డ్స్’ పేరుతో సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది.
వచ్చే ఒలింపిక్స్ అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన సంగీతకారులకు కూడా ఇందులో చోటు కల్పించారు. సంప్రదాయం ప్రకారం అన్నింటికంటే ముందుగా తొలి ఒలింపిక్స్ జరిగిన గ్రీస్ జాతీయ పతాకాన్ని, ఆ తర్వాత ఫ్రాన్స్ జాతీయ పతకాన్ని ప్రదర్శించారు. మెగా ఈవెంట్ విజయవంతం కావడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చైర్మన్ థామస్ బాక్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. ‘అథ్లెట్లు ఒక మ్యాజిక్‌ను ప్రదర్శించారు.
కోట్లాది మంది క్రీడాభిమానుల తరఫున కృతజ్ఞతలు. మళ్లీ 2028లో కలుస్తాం. ఒలింపిక్స్ ఇంకా పైపైకి ఎదుగుతూనే ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నా 206 దేశాల నుంచి ఆటగాళ్లు ఇక్కడకు చేరారు. పతకాల కోసం హోరాహోరీగా పోరాడారు. ఒలింపిక్స్‌తో వెలుగుల నగరం మరింతగా శోభిల్లింది. అత్యుత్తమ క్రీడా ప్రదర్శనే కాదు, ఆటగాళ్లకు సంబంధించి ఇదే సంబరాల వేడుక’ అని బాక్ వ్యాఖ్యానించారు.
ఈ వేదికపై ఐఓసీ రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ మహిళా బాక్సర్ సిండీ ఎన్‌గాంబా, చైనా టేబుల్ టెన్నిస్ స్టార్ సన్ యింగ్‌షా, కెన్యా స్టార్ మారథాన్ రన్నర్ కిప్‌చోగే, క్యూబా దిగ్గజ రెజ్లర్ మిజైన్ లోపెజ్, ఫ్రాన్స్ జూడో స్టార్ టెడ్డీ రైనర్, ఆ్రస్టేలియా స్విమ్మర్ ఎమ్మా మెకీన్ కూడా ఉన్నారు. ఐదు ఖండాల దేశాలకు ప్రతినిధులుగా వీరు వ్యవహరించారు. అనంతరం పారిస్ నగర మేయర్ అన్నె హిడాల్గో ఒలింపిక్ పతాకాన్ని థామస్ బాక్‌కు అందజేశారు.
ఆయన నుంచి తదుపరి విశ్వ క్రీడలు జరిగే లాస్ ఏంజెలిస్ నగరానికి మేయర్‌గా వ్యహరిస్తున్న కరెన్ బాస్ ఈ పతాకాన్ని స్వీకరించారు. అనంతరం ఇదే వేదికపై ఉన్న అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌కు కరెన్ బాస్ ఒలింపిక్ పతాకాన్ని అందించింది. పారిస్, లాస్‌ఏంజెలిస్ నగరాలకు అన్నె హిడాల్గో, కరెన్ బాస్ తొలి మహిళా మేయర్లు కావడం విశేషం.
ఒలింపిక్ పతాకం స్వీకరించాక ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్ అవార్డుల గ్రహీత, అమెరికా సింగర్ గాబ్రియేలా సారిమెంటో విల్సన్ అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించింది. ఫ్రాన్స్ స్విమ్మర్ లియాన్ మర్చండ్ ఒలింపిక్ జ్యోతిని స్టేడియంలోకి తీసుకురాగా, ఆ తర్వాత దానిని ఆర్పేసి అధికారికంగా క్రీడలు ముగిసినట్లు ప్రకటించారు.