భారత్‌కు షాక్.. రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు
Paris Olympics 2024
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్ పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది. 50 కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్‌లో వినేశ్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేశ్‌పై (Vinesh Phogat) అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి.
‘‘వినేశ్ ఫొగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేశ్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం’’ అని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది.
సవాల్ చేయనున్న ఐవోఏ
వినేశ్ ఫొగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సవాల్ చేసేందుకు ఐవోఏ సిద్ధమైంది. ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం.. పోటీ జరిగే రోజున బరువుతోపాటు వైద్య పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీ. అయితే, మంగళవారం రాత్రి సెమీస్ పోరులో తలపడిన ఫొగాట్ బుధవారం ఉదయానికే బరువు పెరగడంపైనా ఐవోఏ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్‌కు గురి చేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐవోఏ డిమాండ్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్ కమిటీ పునఃసమీక్ష లేకపోతే మాత్రం ఫొగాట్‌పై అనర్హత వేటు కొనసాగుతుంది.
రజత పతకం ఉండదా?
ఫైనల్ సమయంలో రెజ్లర్‌పై వేటు పడటంతో మరో ఫైనలిస్ట్‌కు స్వర్ణం దక్కనుంది. అయితే, సిల్వర్ మెడల్‌ను మాత్రం ఎవరికీ కేటాయించకుండా అలాగే వదిలేస్తారు. సెమీస్‌లో ఓడిన ఇద్దరు రెజర్లు కాంస్యం కోసమే తలపడాల్సి ఉంటుంది. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత రెజ్లర్‌గా ఘనత సాధించిన వినేశ్ పతకం లేకుండా స్వదేశానికి తిరిగిరావాల్సిన పరిస్థితి ఎదురైంది.