Search for:
  • Home/
  • Breaking/
  • ‘హ్యాట్రిక్‌కు ఇంకొక్క అడుగే..’

‘హ్యాట్రిక్‌కు ఇంకొక్క అడుగే..’

25 మీ. పిస్టల్‌ పోరులో ఫైనల్‌కు మను బాకర్‌

Paris Olympics 2024

భారత యువ షూటర్‌ మను బాకర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో ముచ్చటగా మూడో పతకానికి గురిపెట్టింది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను మరో విభాగంలోనూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. షూటింగ్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పోరులో టాప్‌ 2లో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది.

శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్‌లో తొలుత ప్రిసిషన్‌ రౌండ్‌లో 294 పాయింట్లు సాధించి టాప్‌ 3లో నిలిచిన మను.. ఆ తర్వాత ర్యాపిడ్‌ రౌండ్‌లో మరింత పుంజుకుంది. ర్యాపిడ్‌ తొలి సిరీస్‌లో ఏకంగా 100 పాయింట్లు సాధించింది. ఈ రౌండ్‌లో 296 స్కోరు దక్కించింది. మొత్తంగా 590 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లి.. మరో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. శనివారం ఫైనల్‌ పోరు జరగనుంది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత షూటర్‌ ఇషా సింగ్‌ 581 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది.

శనివారం జరిగే ఫైనల్‌ పోరులో మను పతకం సాధిస్తే.. ఈ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ పతకాలతో భారత ఒలింపిక్‌ చరిత్రలో సరికొత్త రికార్డును లిఖించనుంది. ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో ఈ యువ షూటర్‌ రెండు కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. తొలుత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత మరో షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.