అర్జెంటీనాదే కోపా అమెరికా
✓ కొలంబియాపై ఉత్కంఠ గెలుపు
✓ 16వ సారి టైటిల్ కైవసం
మియామి: అమెరికా వేదికగా జరిగిన ‘కోపా అమెరికా’ టైటిల్‌ను డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా నిలబెట్టుకుంది. ఇక్కడి హార్డ్‌రాక్ స్టేడియం వేదికగా జరిగిన తుదిపోరులో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. 112వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు లాటరొ మార్టినెజ్ చేసిన గోల్‌తో అర్జెంటీనా ఈ టోర్నీ చరిత్రలో ఏకంగా 16వ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
తన కెరీర్‌లో చివరి కోపా అమెరికా మ్యాచ్ ఆడిన అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ ఈ మ్యాచ్ సగంలోనే గాయం కారణంగా మైదానాన్ని వీడినా ఆ జట్టు అద్భుత పోరాటపటిమతో కొలంబియాను చిత్తుచేసింది. 23 ఏండ్ల తర్వాత ఫైనల్ చేరిన కొలంబియా.. విజయం కోసం ఆఖరి నిమిషం దాకా శ్రమించినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. ఆ జట్టు ఆటగాడు జేమ్స్ రోడ్రిగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది.
ఫైనల్ పోరుకు ముందు టికెట్లు లేకుండా మైదానంలోకి వచ్చిన అభిమానులు అరాచకం సృష్టించడంతో గంటా 22 నిమిషాల పాటు ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో గోల్స్ కోసం రెండు జట్లూ నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ 64వ నిమిషంలో మైదానాన్ని వీడాడు. మ్యాచ్ నిర్దేశిత సమయంలో ఇరుజట్లూ ఒక్క గోల్ చేయకపోవడంతో ఫలితం కోసం అదనపు సమయాన్ని కేటాయించగా మ్యాచ్ ఇక ముగుస్తుందనగా మార్టినెజ్ గోల్ కొట్టి అర్జెంటీనాకు విజయాన్ని అందించాడు.
ఈ టోర్నీలో అతడినే ‘గోల్డెన్ బూట్’ అవార్డు వరించింది. 2021లో కోపా అమెరికా టైటిల్ నెగ్గిన అర్జెంటీనా.. 2022లో ఫిఫా వరల్డ్ కప్‌తో పాటు తాజాగా ఈ టోర్నీలో గెలిచి ఫుట్‌బాల్ చరిత్రలో స్పెయిన్ తర్వాత వరుసగా మూడు మేజర్ టోర్నీలు గెలిచిన రెండో జట్టుగా రికార్డులకెక్కింది. స్పెయిన్ 2008, 2012లో యూరో కప్ నెగ్గగా 2010లో వరల్డ్ కప్ గెలిచింది.