కింగ్ అల్కారజ్
– ఫైనల్‌లో జొకోవిచ్‌పై విజయం
– వరుసగా రెండో ఏడాది టైటిల్ కైవసం
అదే కోర్టు! వాళ్లే ప్రత్యర్థులు!! కానీ ఫలితం మాత్రం మారలేదు. గతేడాది వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌కు రీమ్యాచ్‌గా ఆదివారం ముగిసిన తుదిపోరులోనూ స్పెయిన్ కుర్రాడు కార్లొస్ అల్కారజ్ అదరగొట్టి వింబుల్డన్ కోటలో మరోసారి పాగా వేశాడు. వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో 25వ టైటిల్ గెలవాలన్న దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించి ఆరు వారాల వ్యవధిలో రెండు గ్రాండ్ స్లామ్స్ (ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్) కైవసం చేసుకున్నాడు.
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని మూడో సీడ్ కార్లొస్ అల్కారజ్ వరుసగా రెండో ఏడాది గెలుచుకున్నాడు. ఆదివారం సెంటర్ కోర్టు వేదికగా జరిగిన ఫైనల్‌లో ఈ నయా స్పెయిన్ బుల్ 6-2, 6-2, 7-6 (7/4)తో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై నెగ్గి 21 ఏండ్ల వయసులోనే నాలుగు గ్రాండ్‌స్లామ్స్ సాధించాడు.
గత వింబుల్డన్ ఫైనల్‌లో ఓడినా ఐదు సెట్ల పాటు హోరాహోరిగా పోరాడిన జొకో.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ పట్టుదల, దూకుడు, పోరాటతత్వం లేకుండానే టోర్నీని ముగించాడు. 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లను అలవోకగా నెగ్గిన అల్కారజ్‌కు మూడో సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది.
కీలకమైన ఈ సెట్‌ను దక్కించుకోవడానికి ఇరువురూ పోరాడినా స్కోర్లు సమం కావడంతో ఆట కాస్తా టైబ్రేక్‌కు వెళ్లింది. ఇక టైబ్రేక్‌లో అల్కారజ్.. జొకోను పదే పదే నెట్‌కు దగ్గరగా రప్పిస్తూ పాయింట్లు రాబట్టి సెట్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. ఫైనల్‌లో అల్కారజ్ 5 ఏస్‌లు సంధించి 42 విన్నర్లు కొట్టాడు.
8 ఏస్‌లు కొట్టిన జొకో 26 విన్నర్స్‌కే పరిమితమయ్యాడు. ఈ విజయంతో ఒకే ఏడాది వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్‌ను గెలిచిన ఆరో టెన్నిస్ ప్లేయర్‌గా అల్కారజ్ నిలిచాడు.