మీరు రాకుంటే మేమూ రాం..!
– చాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్‌ను వ్యతిరేకిస్తున్న పాక్
లాహోర్: వచ్చే ఏడాది తమ దేశంలో జరుగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్ నిరాకరించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ టోర్నీలో ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు రాకుంటే 2026లో భారత్/శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్ కప్‌లో తాము ఆడబోమని హెచ్చరించినట్టు పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతేగాక చాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్‌నూ తాము అంగీకరించబోమని టోర్నీ మొత్తం పాక్‌లోనే జరగాలని పీసీబీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
కాగా ఈ విషయంలో ఐసీసీ ఇరు దేశాల బోర్డులను ఎలా సమన్వయపరుస్తుంది..? ఈ సమస్యకు ఏ పరిష్కారం కనుగొంటుందో తెలియాలంటే ఈనెల 22 దాకా ఆగాల్సిందే. జూలై 19-22 మధ్య కొలంబో (శ్రీలంక) వేదికగా జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.