మేము రాం!
- చాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కు వెళ్లేది లేదన్న భారత్
- హైబ్రిడ్ మోడల్‌కు ఓకే
ఢిల్లీ: వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్ తప్పేలా లేదు. ఏడేండ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఆడేందుకు గాను దాయాది దేశం వెళ్లడానికి భారత్ నిరాకరించడమే ఇందుకు కారణం!
ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌కు వెళ్లేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీమ్‌ఇండియా పాక్‌లో పర్యటిస్తుందని భారీ ఆశలు పెట్టుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మరోసారి షాక్ తగిలింది. చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను పీసీబీ ఇది వరకే ఐసీసీకి అందజేయగా దీనికి బీసీసీఐ ఆమోదం తెలపలేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు పాక్‌కు వెళ్లే అంశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని స్పష్టం చేస్తూ హైబ్రిడ్ మోడల్‌లో యూఏఈ లేదా శ్రీలంకలో టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌లు ఆడించాలని ఐసీసీ ముందు ప్రతిపాదన ఉంచినట్టు సమాచారం.
ఈ మేరకు బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘భారత జట్టు పాక్‌కు వెళ్లేది కష్టమే. అయితే తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు హైబ్రిడ్ మోడల్ సాధ్యపడుతుంది. ఆసియా కప్‌లో మాదిరిగానే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈ లేదా శ్రీలంకలో ఆడొచ్చు. ఐసీసీ సైతం దీనిపై దృష్టి సారించింది’ అని తెలిపాడు.