Search for:
  • Home/
  • Breaking/
  • యూరో ఫైనల్‌కు ఇంగ్లండ్‌

యూరో ఫైనల్‌కు ఇంగ్లండ్‌

  - స్పెయిన్‌తో టైటిల్‌ పోరుకు అమీతుమీ
  - సెమీస్‌లోనే నిష్క్రమించిన నెదర్లాండ్స్‌

డార్ట్‌మండ్‌: ప్రతిష్టాత్మక యూరో చాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ 2-1తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఇంగ్లండ్‌ సారథి హ్యారీ కేన్‌కు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఒలీ వాట్కిన్స్‌ 90వ నిమిషంలో గోల్‌ చేసి ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. నెదర్లాండ్స్‌ తరఫున జావి సిమన్స్‌ 7వ నిమిషంలోనే గోల్‌ చేసి ఆట ఆరంభంలోనే డచ్‌ జట్టును ఆధిక్యంలోకి తెచ్చాడు. కానీ 18వ నిమిషంలో హ్యారీ కేన్‌ గోల్‌ చేసి స్కోర్లను సమం చేశాడు.

ఆ తర్వాత ఇరు జట్లూ ఎంత ప్రయత్నించినా గోల్‌ కొట్టలేకపోయాయి. మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన వాట్కిన్స్‌ చివరి నిమిషంలో చేసిన గోల్‌తో నెదర్లాండ్స్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ విజయంతో ఇంగ్లండ్‌.. ఈనెల 15న స్పెయిన్‌తో టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో 12 ఏండ్ల తర్వాత ఫైనల్‌ చేరిన స్పెయిన్‌ కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంటే ఇంతవరకూ యూరో కప్‌ నెగ్గని ఇంగ్లండ్‌ ఈసారైనా ఆ ముచ్చటను తీర్చుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరుగనుంది.

*అర్జెంటీనా X కొలంబియా

అమెరికా వేదికగా జరుగుతున్న కోపా అమెరికా ఫైనల్‌ ప్రత్యర్థులెవరో తేలిపోయింది. గురువారం ఛార్లెంట్‌ (అమెరికా) వేదికగా జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 1-0తో ఉరుగ్వేను ఓడించి ఫైనల్‌ చేరింది. కొలంబియా ఆటగాడు జెఫర్‌సన్‌ లెర్మా 39వ నిమిషంలో గోల్‌ చేయగా ఉరుగ్వే ఒక్క గోల్‌ చేయలేకపోయింది. సోమవారం జరుగబోయే ఫైనల్‌లో కొలంబియా.. లియోనల్‌ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాను ఢీకొననుంది. మూడో స్థానం కోసం ఉరుగ్వే, కెనడా తలపడనున్నాయి.

*ఓటమిని జీర్ణించుకోలేక..

ఆటలో గెలుపోటములు సహజమే అయినా తమ అభిమాన జట్టు ఓటమిని నెదర్లాండ్స్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. యూరో కప్‌లో నెదర్లాండ్స్‌ ఓడిపోయాక ఆ జట్టు అభిమానులు ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌పై దాడికి దిగారు. మ్యాచ్‌ ముగిశాక ఓ పబ్‌లో సంబురాలు చేసుకుంటున్న ఇంగ్లండ్‌ అభిమానులను లక్ష్యంగా చేసుకుని వారిపై పిడిగుద్దులు గుద్దుతూ అక్కడున్న కుర్చీలు, బల్లలను చెల్లాచెదురుగా పడేసి రచ్చ చేశారు. మరోవైపు కోపా అమెరికా టోర్నీలో భాగంగా కొలంబియాతో మ్యాచ్‌ ఓడాక ఉరుగ్వే ఆటగాళ్లే ప్రత్యర్థి జట్టు అభిమానులపై దాడి చేశారు. మ్యాచ్‌ ఓడి నిరాశగా డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తున్న ఉరుగ్వే ఆటగాడు డార్విన్‌ నునెజ్‌తో పాటు మరో ఇద్దరు కలిసి కొలంబియా అభిమానుల వద్దకు వెళ్లి దాడికి పాల్పడ్డారు.