భారత కోచ్‌గా గంభీర్..
బీసీసీఐ అధికారిక ప్రకటన
- శ్రీలంక సిరీస్‌తో బాధ్యతల స్వీకరణ
ముంబై: భారత క్రికెట్‌లో గౌతం గంభీర్ శకం మొదలైంది. జాతీయ పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా గంభీర్‌ను నియమిస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌తో మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో గంభీర్‌కు ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్టు అందులో పేర్కొంది. అశోక్ మల్హోత్రా ఆధ్వర్యంలోని అడ్వైజరీ కమిటీ సూచన మేరకు గంభీర్‌ను ద్రావిడ్ వారసుడిగా ప్రకటించింది. వాస్తవానికి ఐపీఎల్-17 ఫైనల్ ముగిసిన వెంటనే హెడ్‌కోచ్ రేసులో గంభీర్ పేరు ప్రధానంగా వినిపించినా జీతభత్యాలు, సహాయక కోచింగ్ సిబ్బంది, ఇతర అంశాలపై చర్చలతో అధికారిక ప్రకటన ఆలస్యమైనట్టు బోర్డు వర్గాల సమాచారం.
ద్రావిడ్ హయాంలో భారత జట్టు మూడు ఫార్మాట్లలోనూ అప్రతిహత విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిందని, ఆ వారసత్వాన్ని గంభీర్ మరింత ముందుకు తీసుకెళ్తాడని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా అన్నారు. ఇక ప్రధాన కోచ్‌గా నియమితుడైన గంభీర్‌కు మొదటి పరీక్ష ఈ నెల 27 నుంచి శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌తో మొదలవనుంది. 2004 నుంచి 2016 దాకా టీమ్‌ఇండియాకు 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లలో ప్రాతినిధ్యం వహించిన గంభీర్.. భారత జట్టు 2007లో గెలిచిన టీ20 ప్రపంచకప్, 2011లో నెగ్గిన వన్డే వరల్డ్ కప్ విజయాలలో కీలకపాత్ర పోషించాడు.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు సారథిగా 2012, 2014లలో ట్రోఫీని అందించాడు. ఆటగాడిగా క్రికెట్‌కు వీడ్కోలు పలికాక రాజకీయాల్లోకి వెళ్లిన గంభీర్.. గత ఎన్నికలలో వాటికి దూరంగా ఉన్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌కు రెండేండ్ల పాటు మెంటార్‌గా వ్యవహరించిన గౌతీ.. ఈ ఏడాది మార్చి-మే మధ్య జరిగిన ఎడిషన్‌లో కేకేఆర్‌కు మెంటార్‌గా వచ్చి పదేండ్ల తర్వాత కోల్‌కతాకు ట్రోఫీని అందించడంలో సఫలీకృతుడై బీసీసీఐ దృష్టిలో పడ్డాడు. రానున్న రోజుల్లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ వంటి కీలక టోర్నీలున్న నేపథ్యంలో ‘మెన్ ఇన్ బ్లూ’ను గంభీర్ ఏ మేరకు విజయవంతంగా నడిపిస్తాడనేది ఆసక్తికరం.
*దూకుడు మంత్రం పనిచేసేనా?
భారత క్రికెట్‌లో కోహ్లీ కంటే మునుపే దూకుడుకు మారుపేరుగా నిలిచిన గంభీర్ మైదానం లోపల, వెలుపల అగ్రెసివ్‌గా ఉంటాడు. ముక్కుసూటిగా మాట్లాడే అతడి వ్యవహార శైలి కారణంగా గంభీర్ పలుమార్లు విమర్శలు సైతం ఎదుర్కున్నాడు. అయితే రోహిత్, కోహ్లీ, జడేజా వంటి దిగ్గజాలు కెరీర్ చరమాంకంలో ఉన్న దశలో వారి స్థానాలను భర్తీ చేసే యువ ఆటగాళ్లను తయారుచేయడం గంభీర్‌కు కత్తిమీద సామే.
‘భారతదేశమే నా గుర్తింపు. నా దేశానికి సేవ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. గతంలో నేను మరో క్యాప్ (రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ఉద్దేశిస్తూ) ధరించినా మళ్లీ సొంతగూటికి రావడం సంతోషంగా ఉంది. నీలం రంగు జెర్సీ ధరించిన ఆటగాళ్లు 140 కోట్ల భారతీయుల ఆశలు మోస్తున్నారు. వాళ్ల కలల్ని నిజం చేస్తూ ప్రతి భారతీయుడు గర్వించేలా చేయడమే నా ముందున్న లక్ష్యం’
– గౌతం గంభీర్