బోణీ కొట్టిన జర్మనీ, స్విట్జర్లాండ్..!
యూరో కప్-2024
ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక యూరో కప్-2024కు తెర లేచింది. ఈ టోర్నమెంట్‌లో ఆతిథ్య జర్మనీ శుభారంభం చేసింది. శనివారం మ్యూనిక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 5-1తో జర్మనీ అద్భుత విజయం సాధించింది.
ఈ తొలిపోరులో ఏ దశలోనూ పత్యర్ధికి జర్మనీ అవకాశమివ్వలేదు. ఈ మ్యాచ్ 10వ నిమిషంలో ఫ్లోరియన్ విర్ట్జ్ జర్మనీకి తొలి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత జమాల్ ముసియాలా, కై హావర్ట్జ్ ఫస్ట్‌హాఫ్‌లో మరో రెండు గోల్స్‌ను అందించారు. దీంతో ఫస్ట్‌హాఫ్ ముగిసేసరికి జర్మనీ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత సెకెండ్ హాఫ్‌లో కూడా జర్మనీ అదరగొట్టింది. ఇక ఈ విజయంతో జర్మనీ ఖాతాలో మూడు పాయింట్లు వచ్చి చేరాయి. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. హంగేరీ జట్టుపై 3-1తో స్విస్ జట్టు ఘన విజయం నమోదు చేసింది.
ఇక ఈ మెగా టోర్నీ జర్మనీలోని 10 పట్టణాల్లో జరగనుంది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఈ టోర్నీ జూలై 14న బెర్లిన్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక గ్రూప్ ‘ఎ’లో జర్మనీ, స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్… గ్రూప్ ‘బి’లో స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా… గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, స్లొవేనియా, సెర్బియా… గ్రూప్ ‘డి’లో నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా… గ్రూప్ ‘ఇ’లో బెల్జియం, స్లొవేకియా, రొమేనియా, ఉక్రెయిన్… గ్రూప్ ‘ఎఫ్’లో పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, జార్జియా, టర్కీ జట్లు ఉన్నాయి.