భారత జట్లకు కఠినమైన డ్రా
– థామస్ అండ్ ఉబెర్ కప్
దిల్లీ: థామస్ అండ్ ఉబెర్ కప్‌లో భారత పురుషులు, మహిళల జట్లకు కఠినమైన డ్రా ఎదురైంది. శుక్రవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన డ్రాలో థామస్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత పురుషుల జట్టుకు గ్రూపు-సిలో చోటు దక్కింది. 14 సార్లు విజేత, నిరుటి రన్నరప్ ఇండోనేసియాతో పాటు థాయ్‌లాండ్, ఇంగ్లాండ్ గ్రూపు-సిలో ఉన్నాయి. 2022 బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో ఇండోనేసియాను చిత్తుచేసి థామస్ కప్‌లో తొలిసారిగా విజేతగా నిలిచింది. ఈ టైటిల్ నెగ్గిన ఆరో జట్టుగా ఘనత సాధించింది. ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టుకు గ్రూపు-ఎలో స్థానం లభించింది. ఉబెర్ కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టు, 15 సార్లు విజేత చైనాతో పాటు కెనడా, సింగపూర్ ఈ గ్రూపులో ఉన్నాయి. 1957, 2014, 2016లో సెమీస్ చేరుకోవడమే ఉబెర్ కప్‌లో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు చైనాలోని చెంగ్డూలో ఈ టోర్నీ జరుగుతుంది.