ఫ్రెండ్‌షిప్ గేమ్స్’.. రాజకీయ కుట్ర
- రష్యా క్రీడలకు దూరంగా ఉండండి
- అథ్లెట్లు, ప్రభుత్వాలకు ఐవోసీ విజ్ఞప్తి
జెనీవా: ‘ప్రపంచ క్రీడల’పై రష్యా ఎదురుదాడి.. అంతర్జాయతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)ని కలవరపెడుతోంది. ఒలింపిక్స్‌లో తమ దేశంపై నిషేధం విధించడంతో.. రష్యానే అలాంటి విశ్వక్రీడల నిర్వహణకు సన్నాహకాలు చేస్తోంది. ఒలింపిక్స్ తరహాలో సెప్టెంబరు 15 నుంచి 29 వరకు మాస్కో, యకతరీన్‌బర్గ్‌లో ‘అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్ గేమ్స్’ పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇదివరకే ప్రకటించారు. ఇందులో పతక విజేతల కోసం రూ. 415 కోట్ల ప్రైజ్‌మనీని కూడా ఆయన ప్రకటించారు. ఇదే ఐవోసీని ఎక్కువగా భయపెడుతోంది. ఒలింపిక్స్‌లో పతకాలు మాత్రమే ఇస్తారు కానీ.. నజరానాలు ఉండవు. అథ్లెట్లు డబ్బు కోసం ఆశపడి రష్యా క్రీడల్లో పాల్గొనే అవకాశం లేకపోలేదు. అందుకే.. ఈ ‘ఫ్రెండ్‌షిప్ గేమ్స్’లో అథ్లెట్లు ఎవరూ పాల్గొనవద్దని ఐవోసీ విజ్ఞప్తి చేస్తోంది. విశ్వక్రీడల స్ఫూర్తిని దెబ్బతీసి, ఆటలను రాజకీయమయం చేసేందుకు రష్యన్ సమాఖ్య చేస్తున్న కుట్ర ఇదని ఐవోసీ చీఫ్ థామస్ బాచ్ మంగళవారం ఆరోపించారు.