పంత్.. రైట్ రైట్
దిల్లీ: భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అతను దాదాపు 15 నెలల విరామం తర్వాత పోటీ క్రికెట్లోకి అడుగు పెడుతున్నాడు. 2022 డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఎట్టకేలకు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించిన అతను.. ఈ ఐపీఎల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు. పంత్ బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయడానికి తగ్గ ఫిట్‌నెస్ సాధించినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఈ నెల 22న ఆరంభమయ్యే ఐపీఎల్ 17వ సీజన్లో పంత్.. దిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. లీగ్‌లో అతను వికెట్ కీపింగ్ కూడా చేయబోతున్నాడు. ‘‘ప్రమాదం తర్వాత 14 నెలల పాటు తీవ్రతతో సాగిన కోలుకునే ప్రక్రియ అనంతరం రిషబ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అతడు వికెట్ కీపర్ బ్యాటర్‌గా 2024 ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అని బీసీసీఐ పేర్కొంది. పంత్ ఈసారి ఐపీఎల్‌లో ఆడటం ఖరారైనప్పటికీ.. వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా అనే విషయంలో సందేహాలు ఉండేవి. బీసీసీఐ ప్రకటనతో సందిగ్ధత తొలగిపోయింది. వికెట్ కీపింగ్ చేయడంతో పాటు దిల్లీని అతనే నడిపించబోతున్నాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీ సందర్భంగా గాయపడడంతో అతను లీగ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. గుజరాత్ టైటాన్స్ ప్రధాన పేసర్ మహ్మద్ షమి కూడా ఈసారి లీగ్‌కు దూరమైన సంగతి తెలిసిందే.