సచిన్ రికార్డు బద్దలు
చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ తమ్ముడు..
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభం నుంచి అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న ముంబై యువ ఆటగాడు ముషీర్ ఖాన్.. ఇప్పుడు ఫైనల్లో కూడా అదరగొట్టాడు. వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న తుది పోరులో ముషీర్ ఖాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు చేసి నిరాశపరిచిన ముషీర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతకంతో మెరిశాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. ముషీర్ 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
రంజీ ట్రోఫీ ఫైనల్స్‌లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ముంబై ఆటగాడిగా ముషీర్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల 14 రోజుల వయస్సులో ముషీర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1994-95 రంజీ సీజన్ ఫైనల్లో 21 ఏళ్ల 11 నెలల వయసులో సచిన్ సెంచరీ చేశాడు.
తాజా మ్యాచ్‌తో 29 ఏళ్ల సచిన్ రికార్డును ముషీర్ బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ను సచిన్ ప్రత్యక్షంగా స్టాండ్స్ లో నుంచి వీక్షిస్తున్న సమయంలోనే ముషీర్ ఈ ఘనత సాధించడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు వాంఖడేకు వెళ్లారు.
ఇక ఈ ఏడాది సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన ముషీర్.. 108.25 సగటుతో 433 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్బ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది.