చిన్నస్వామిలో మ్యాచ్‌లు కష్టమేనట..!
బెంగళూరులో నీటి కటకట..
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు కాంగ్రెస్ మరో షాక్..
కన్నడ రాజధాని బెంగళూరులో నీటి కష్టాలతో ఐటీ క్యాపిటల్ ఆగమాగం అవుతోంది. గార్డెన్ సిటీలో ప్రజలకు వేసవికాలం మొదలుకాకముందే తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. సిలికాన్ వ్యాలీలో బోర్లు నోర్లు తెరుచుకోగా ట్యాంకర్లయినా తెప్పించుకుందామనుకున్నా అవీ దొరకడం లేదు. ప్రజలు వంట పాత్రలకు ఎక్కువనీటిని వాడొద్దని, వీలైతే వాటిని కడగడం పూర్తిగా మానేయాలని, స్నానాలు కూడా అతిగా చేయొద్దని ఇప్పటికే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులే ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. బాత్‌రూములల్లో నీళ్లు రాక కొంతమంది దగ్గర్లో ఉండే షాపింగ్ మాల్స్‌కు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇన్ని కష్టాలు పడుతున్నా మరో పది రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్ – 17వ సీజన్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగబోయే మ్యాచ్‌లు చూసి అయినా సేదతీరుతామనుకుంటే సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రజలకు ఆ సంతోషాన్ని కూడా మిగిల్చేట్టు లేదు. నీటి ఎద్దడి కారణంగా చిన్నస్వామి నుంచి ఆర్సీబీ హోం మ్యాచ్‌లు షిఫ్ట్ అవనున్నట్టు కర్నాటక క్రికెట్ అసోసియేషన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఐపీఎల్‌లో ఇంతవరకూ ట్రోఫీ నెగ్గని జట్టుగా ఉన్న ఆర్సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తక్కువేం లేదు. ఆర్సీబీ చిన్నస్వామిలో మ్యాచ్‌లు ఆడుతుందంటే ఫలితాలతో సంబంధం లేకుండా స్టేడియం నిండిపోతుంది. కానీ ఈసారి అక్కడ ప్రజలకు ఆ అదృష్టం లేనట్టుంది. బెంగళూరులో నీటి కటకట కారణంగా ఆర్సీబీ ఆడే మ్యాచ్‌లను పూణెకు గానీ వైజాగ్‌కు గానీ షిఫ్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఎందుకు..?
పిచ్ తయారీకి నీరు ఎక్కువగా అవసరం ఉంటుంది. దానికి తోడు ఔట్ ఫీల్డ్, స్టేడియంలో వేలాదిగా వచ్చే ప్రేక్షకుల నీటి నిర్వహణకూ ట్యాంకర్లకు ట్యాంకర్లు నీళ్లు కావాలి. ఒకవైపు జనాల గొంతెండుతుంటే స్టేడియంలో నీటి వృథా చేస్తున్నదని సిద్ధరామయ్య ప్రభుత్వం మీద విమర్శలు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో చిన్నస్వామిలో మ్యాచ్‌ల నిర్వహణకు కాంగ్రెస్ సర్కారు అంగీకరించబోదన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే బెంగళూరు ఫ్యాన్స్‌కు భారీ షాక్ తప్పకపోవచ్చు.
చర్చిస్తున్నాం..!
ఇదే విషయమై కర్నాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ… ‘ఈ సమస్య మీద మేం చర్చలు జరుపుతున్నాం. అప్పటిదాకా దీనిపై మేం ఏ కామెంట్స్ చేయదలుచుకోలేదు..’అని ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడవు.
ఆర్సీబీ హోం మ్యాచ్‌ల షెడ్యూల్..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి విడత షెడ్యూల్ మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ.. బెంగళూరులో మూడు మ్యాచ్‌లను నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నై – బెంగళూరు మధ్య చెన్నై వేదికగా జరగాల్సి ఉండగా ఆర్సీబీ తర్వాత ఆడబోయే మిగిలిన మూడు మ్యాచ్‌లూ సొంతగడ్డపైనే ఆడాల్సి ఉంది. మార్చి 24, 29, ఏప్రిల్ 02న ఆర్సీబీ హోంమ్యాచ్‌లు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ సర్కారు కేఎస్‌సీఏకు పర్మిషన్ ఇవ్వకుంటే ఇక అంతే సంగతులు…!