సౌదీ అరేబియా ఆశలపై నీళ్లు చల్లిన జై షా
బీసీసీఐ ఏమైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా..?
BCCI | ఎవ్వరు పడితే వాళ్లు వచ్చి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పెట్టుబడులు పెడతామంటే కుదురదని, అందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదని జై షా స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టాలని గత రెండేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్న సౌదీ అరేబియా ఆశలపై నీళ్లు చల్లుతూ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కాలంలో క్రీడారంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న సౌదీ ప్రభుత్వం.. ఐపీఎల్‌లోనూ ఇన్వెస్ట్ చేయాలని కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత క్రికెట్‌కు బంగారు బాతుగుడ్డులా దొరికిన ఐపీఎల్‌లో వాటా దక్కించుకుని చక్రం తిప్పుదామనుకున్న సౌదీకి షా షాకిచ్చాడు.
ఇదే విషయమై షా సోమవారం పీటీఐతో మాట్లాడుతూ… ‘బీసీసీఐ అనేది ఒక సొసైటీ. ఎవరుపడితే వాళ్లు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఇదేం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు..’ అని అన్నాడు. జై షా చెప్పినట్టుగానే బీసీసీఐ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇందులో జాతీయ క్రీడల శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోవడానికి వీళ్లేదు. కేంద్ర క్రీడా శాఖ నుంచి కూడా బీసీసీఐ ఎలాంటి నిధులూ పొందదు. పూర్తిగా సొంత ఆదాయం మీద నడుస్తుంది.
జై షా వ్యాఖ్యానించిన దాని ప్రకారం.. బీసీసీఐ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిష్టర్ అయింది. 1928లో నాటి బ్రిటీష్ ప్రెసిడెన్సీలో ఉన్న మద్రాస్‌లో 1860 సొసైటీస్ యాక్ట్ లోని XXI రిజిష్టర్ అయినట్టు బీసీసీఐ వికిపీడియా పేజీలో కూడా వివరాలున్నాయి. దీని ప్రకారం బీసీసీఐలో బయిటి వ్యక్తులు గానీ సంస్థలు గానీ పెట్టుబడులు పెట్టడం, లాభాలు పంచుకోవడం ఉండదు. రాష్ట్ర అసోసియేషన్లతో కూడిన కలయిక కావున వాటికి బీసీసీఐ లాభాల్లో వాటా దక్కుతుంది. బీసీసీఐలో విదేశీ పెట్టుబడులు రావాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అది సాధ్యమవుతుంది.