ఇండో-పాక్ మ్యాచ్ టికెట్ రూ.1.8 కోట్లా?
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్‌లో ఎనలేని క్రేజ్. అమెరికాలో జరగనున్న టీ20 వరల్డ్‌క్‌పలో జూన్ 9న న్యూయార్క్‌లో జరిగే ఈ ఇండో-పాక్ జట్ల మ్యాచ్ టిక్కెట్లకు కూడా ఊహించని డిమాండ్ ఏర్పడింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా మూడు కేటగిరీలుగా రూ. 14 వేల నుంచి 33 వేల వరకు (175, 300, 400 డాలర్లు) ధరలను నిర్ణయించారు. అయితే, అమ్మకాలు ఆరంభమైన కొద్ది సేపటికే అధికారిక సైట్‌లో టిక్కెట్లు మొత్తం అమ్ముడవగా.. రీసేల్ మార్కెట్‌లో కొన్ని టిక్కెట్లు ఎక్కువ ధరకు దర్శనమిస్తున్నాయి. వీఐపీ టిక్కెట్ల ధరలు రూ. 33 వేలు (400 డాలర్లు) ఉండగా.. రీసేల్‌లో రూ. 33 లక్షలు (40,000 డాలర్లు) పలుకుతున్నాయి. ఎన్‌బీఏ ఫైనల్‌కు ఎంతటి డిమాండ్ ఉంటుందో.. ఈ మ్యాచ్‌కు కూడా అదే తరహాలో క్రేజ్ ఉండడం విశేషం. రీసేల్ సైట్లలో అతి తక్కువ ధర టిక్కెట్ అంటే రూ. 96 వేలు (1166 డాలర్లు)గా ఉంది. సీట్ గీక్ అనే సేల్స్ వెబ్‌సైట్‌లో సెక్షన్ 500 టిక్కెట్ ధర ఏకంగా రూ. 1.86 కోట్లు (ఫీజులతో కలిపి) పలుకుతుండడం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.