ఆ నలుగురి ఖేల్ ఖతమైనట్లేనా..?
బీసీసీఐ ప్రకటించిన 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్‌గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్ దేశవాలీ క్రికెట్‌లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు.
శిఖర్ అయితే మొత్తానికే క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్ కోసమే అతను గేమ్‌లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్ అజింక్యరహానేను కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. రహానే రంజీల్లో పూర్తి స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. అతని నుంచి చొప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టి ఉంటుంది.
ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురి విషయంలో బీసీసీఐ కరెక్ట్‌గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే వీరి కెరీర్‌లు ఖతమైనట్లేనా..? ఈ నలుగురు తిరిగి పుంజుకుని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య చాంతాండంత ఉంది. వీరి భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. పై పేర్కొన్న నలుగురితో పాటు సరైన అవకాశాలు రాని చహల్, దీపక్ హుడాలపై కూడా బీసీసీఐ వేటు వేసింది