వావ్.. ఆసీస్
భారీ ఛేదనలో ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విన్
- కివీస్‌తో తొలి టీ20
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనను ఆస్ట్రేలియా అద్భుతంగా ఆరంభించింది. బుధవారం జరిగిన తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించి వారెవ్వా అనిపించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 నాటౌట్), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆసీస్ ఆరు వికెట్లతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 68), డెవాన్ కాన్వే (46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63)కు తోడు ఫిన్ అలెన్ (31) సత్తా చాటడంతో 20 ఓవర్లలో 3 వికెట్లకు 215 పరుగులు సాధించింది. భారీ ఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 216/4 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు వార్నర్ (32), హెడ్ (15 బంతుల్లో 24) మెరుపు ఆరంభాన్నిచ్చారు. వన్‌డౌన్‌లో వచ్చి ఆఖరిదాకా క్రీజులో నిలిచిన కెప్టెన్ మిచెల్.. మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 25), టిమ్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. చివరి ఓవర్‌లో టిమ్ వీర విహారం చేశాడు. ఆరు బంతుల్లో 16 పరుగులు అవసరమైన దశలో బౌలర్ సౌఽథీ తొలి రెండు బంతుల్లో 3 పరుగులే ఇచ్చాడు. అయితే, చివరి నాలుగు బంతులను టిమ్ 4, 6, 2, 4గా మలచి కంగారూలకు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. మిచెల్ మార్ష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీ20ల్లో ఆసీ్‌సకు ఇది మూడో అత్యధిక ఛేదన కావడం విశేషం.