మహిళల చీఫ్ కోచ్‌పై వేటు
- టీమ్ బస్సులో మద్యం తాగిన జైసింహా
- సస్పెన్షన్ విధించిన హెచ్‌సీఏ
- తప్పులు చేస్తే జీవితకాల నిషేధం: జగన్‌మోహన్‌రావు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అలజడి. ప్లేయర్లను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన కోచ్ వారి పట్ల అనుచితంగా ప్రవర్తించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అండర్-23 వన్డే టోర్నీ కోసం హైదరాబాద్ మహిళల సీనియర్ జట్టుతో కలిసి బస్సులో ప్రయాణించిన చీఫ్ కోచ్ విద్యుత్ జైసింహా మద్యం తాగడం తాజాగా బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా జైసింహా మద్యం సేవిస్తున్న ఫొటోలు, వీడియోలు ఈ నెల 15న హెచ్‌సీఏకు ఈమెయిల్ ద్వారా అందినట్లు తెలిసింది. దీంతో వెంటనే స్పందించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు.. జైసింహాపై సస్పెన్షన్ విధిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన జగన్.. సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీవితకాలం పాటు నిషేధం విధించేందుకు కూడా వెనుకాడబోమని ఆయన అన్నారు. ప్రస్తుతం మహిళా క్రికెటర్లతో తమ సిబ్బంది మాట్లాడుతున్నారని త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.