స్పిన్ చాణక్యుడు..రవిచంద్రన్ అశ్విన్
టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి
బ్యాటర్ బుర్రను చదివే మేధావి అతడు. బ్యాటర్ ఏ షాట్ ఆడగలడో అని ముందే ఊహించి.. ఎలా వికెట్ పడగొట్టాలనే ప్రణాళిక రచించే ఇంజినీర్ అతడు. బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకుని.. వేళ్లతో మాయ చేసే మాంత్రికుడు అతడు. వైవిధ్యమైన అస్త్రాలతో ప్రత్యర్థి సేనను కకావికలం చేసే యోధుడు అతడు. ఇలా అన్నీ కలగలిసిన స్పిన్ చాణక్యుడు.. రవిచంద్రన్ అశ్విన్. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఘనతను అందుకున్నాడీ చెన్నై వీరుడు. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు. అతనికంటే ముందు 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో 8 మంది మాత్రమే ఈ రికార్డు సొంతం చేసుకున్నారంటే ఇదెంతో అరుదైనదో అర్థం చేసుకోవచ్చు. 2011లో టెస్టు అరంగేట్రం చేసిన అశ్విన్.. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌ల ఘన వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. 12 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనలు.. ఒంటిచేత్తో జట్టును గెలిపించిన ఎన్నో సందర్భాలు.. క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన ఎన్నో బంతులు! తొలి మూడేళ్లలో అతను 23 టెస్టుల్లో 114 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ తర్వాత వైవిధ్యమైన బంతులతో మరింతగా చెలరేగాడు. 2015 జనవరి నుంచి స్వదేశంలో 43 టెస్టుల్లో 252 వికెట్లు, విదేశాల్లో 32 టెస్టుల్లో 134 వికెట్లు సాధించాడు. భారత్‌లో అయితే అతనికి తిరుగేలేదు.
56 టెస్టుల్లో 347 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ కనీసం 200 వికెట్లు తీసిన భారత బౌలర్లలో అతనిదే అత్యుత్తమ సగటు (21.22). అతనో మ్యాచ్ విన్నర్. సొంతగడ్డపై అతనాడిన 57 టెస్టుల్లో భారత్ 42 గెలిచింది. ఓవరాల్‌గా 97 టెస్టుల్లో 56 విజయాలు సాధించింది. 10 సార్లు అతను ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. పాతబంతితో కాదు కొత్త బంతితోనూ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు అశ్విన్. తొలి 10 ఓవర్లలో 47, 15 ఓవర్లలో 79, 20 ఓవర్లలో 121 వికెట్లు పడగొట్టాడు. తన అరంగేట్ర సమయం నుంచి తొలి 20 ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ అతనే. ఎడమ చేతి వాటం బ్యాటర్లు అంటే అశ్విన్ చెలరేగిపోతాడు. అతని ఖాతాలో 249 వికెట్లు ఇవే. మరే బౌలర్ కూడా ఇన్ని ఎడమ చేతి వాటం బ్యాటర్ల వికెట్లు తీయలేదు. అశ్విన్ అరంగేట్రం నుంచి అతని కంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసింది కేవలం లైయన్ (509) మాత్రమే. అయితే అశ్విన్ కంటే అతను 26 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడాడు. మ్యాచ్‌ల పరంగా మురళీధరన్ (87) తర్వాత, బంతుల పరంగా మెక్‌గ్రాత్ తర్వాత (25,528) టెస్టుల్లో 500 వికెట్ల ఘనత అందుకున్న బౌలర్ అశ్విన్. అశ్విన్ తన 98వ టెస్టులో.. 25,714 బంతుల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు. అరంగేట్రం చేసి పుష్కర కాలం దాటినా.. ఇప్పటికీ భారత్‌లో టెస్టు సిరీస్ అంటే అశ్విన్‌కు విదేశీ జట్లు భయపడుతూనే ఉంటాయి. ఎంత సాధన చేసినా, గొప్ప సన్నద్ధతతో వచ్చినా అశ్విన్ ఉచ్చులో చిక్కుకుంటూనే ఉంటాయి.