మణికట్టు వీరుడు..గుండప్ప విశ్వనాథ్
టెస్టు క్రికెట్ పట్ల అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ తగ్గిపోతున్న రోజులివి. ఆ ఫార్మాట్‌కు ఆకర్షణ తేవడానికి, ఆటలో వేగం పెంచడానికి, ఫలితాలు రాబట్టడానికంటూ ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బజ్‌బాల్ ఆటతో టెస్టుల స్వరూపమే మారిపోతోంది. మిగతా జట్లూ ఆ శైలిని అనుసరిస్తూ.. టీ20 క్రికెట్ ప్రభావం కూడా తోడై.. టెస్టు క్రికెట్ తన సహజ అందాన్ని కోల్పోతోంది. ఆటలో వేగం పెరగడం మాటేమో కానీ.. రెండు మూడు రోజుల్లో మ్యాచ్‌లు ముగిసిపోతున్నాయి. అయిదు రోజులు హోరాహోరీగా తలపడే మ్యాచ్‌లు కరవైపోతున్నాయి. ఒక్క సెషన్లో జట్టంతా కుప్పకూలిపోతోంది. ఒక రోజు మొత్తం ఓ బ్యాటర్ నిలిస్తే అదో అద్భుతంలా కనిపిస్తోంది. టెక్నిక్‌తో, టైమింగ్‌తో షాట్లు ఆడే రూట్ లాంటి బ్యాటర్లు కూడా టీ20ల తరహాలో అడ్డదిడ్డంగా షాట్లు ఆడుతుండటం నిన్నటితరం క్రికెట్ అభిమానులకు మింగుడుపడని విషయం. ఈ సందర్భంలోనే సంప్రదాయ శైలి ఆటతోనే క్రికెట్ ప్రేమికులను కట్టి పడేసి.. తన ఆట చూసేందుకే మైదానానికి రప్పించిన ఓ బ్యాటింగ్ మేధావి గురించి మాట్లాడుకోవాలి. తన పేరు.. గుండప్ప విశ్వనాథ్.
……
1975లో మద్రాస్‌టెస్టులో ఆండీ రాబర్డ్స్ నేతృత్వంలోని భీకర విండీస్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ విషీ సాధించిన 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ విజ్డన్ టాప్-100 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచింది. భారత్ 190కే ఆలౌట్ కాగా.. 50 శాతం పైగా పరుగులు విషీవే.
……
బ్యాటింగ్‌లో మణికట్టు మాయాజాలానికి చివరి గుర్తు వీవీఎస్ లక్ష్మణ్. ఇంకా వెనక్కి వెళ్తే మరో హైదరాబాదీ మహమ్మద్ అజహరుద్దీన్ గుర్తుకొస్తాడు. కానీ వీరి కంటే ముందు మణికట్టును మంత్రదండంలా వాడి మైదానం అద్భుతమైన షాట్లతో కనువిందు చేసిన ఆటగాడు గుండప్ప విశ్వనాథ్. భీకర వేగంతో దూసుకొచ్చే పేసర్ల బంతులను గుండప్ప ఆలస్యంగా స్క్వేర్ కట్ ఆడి బౌండరీ బాట పట్టించే దృశ్యం ఆ తరం క్రికెట్ అభిమానులకు ఓ మరపురాని జ్ఞాపకం. స్క్వేర్ కట్ క్రికెట్ చరిత్రలో ఇంతకంటే అందంగా ఎవరూ ఆడలేరు అనిపించేది ఆయన ఆట చూస్తుంటే. క్రికెట్ పుస్తకంలో ఉన్న మిగతా సంప్రదాయ షాట్లనూ అలవోకగా, అందంగా ఆడేవాడు విశ్వనాథ్. భీకరమైన పేస్‌ను ఎంత ధీమాగా ఎదుర్కొనేవాడో.. గింగిరాలు తిరిగే స్పిన్‌కు చక్కటి ఫుట్‌వర్క్‌తో అంతే దీటుగా బదులిచ్చేవాడు. సహచరులు, అభిమానులు విషీ అని ముద్దుగా పిలుచుకునే ఈ సొగసరి బ్యాటర్.. 70వ దశకంలో ఆణిముత్యాల్లాంటి ఇన్నింగ్స్‌లతో భారత జట్టు సాధించిన అద్భుత విజయాల్లో భాగమయ్యాడు. గణాంకాల్లో సునీల్ గావస్కర్ కంటే కింద ఉండొచ్చు కానీ.. జట్టు కోసం నిలవడంలో, కఠినమైన పిచ్‌లపై అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడడంలో, ఇంకా ఇంకా చూడాలనిపించే బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరించడంలో విషీ ఎవరికీ తీసిపోడు.
విషీ తన టెస్టు కెరీర్లో 14 శతకాలు సాధించాడు. ఆ మ్యాచ్‌లు ఒక్కదాంట్లోనూ భారత జట్టు ఓడకపోవడం ఆయన శతకాలు ఎంత విలువైనవో తెలియజేస్తుంది. తన తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన విషీ.. తొలి టెస్టు (1969)లోనూ శతకం సాధించాడు. కాన్పూర్‌లో జరిగిన తన తొలి టెస్టులో విషీ తొలి ఇన్నింగ్స్‌లో డకౌటవడంతో ఆస్ట్రేలియా బౌలర్లు అతణ్ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం (137)తో ప్రపంచ క్రికెట్లోకి తన ఆగమనాన్ని ఘనంగా చాటిచెప్పాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. విషీ ఆ తర్వాత సాధించిన 13 శతకాలూ భారత జట్టుకు విజయాలు కట్టబెట్టాయి. అందులో 1975లో వెస్టిండీస్ లాంటి భీకర జట్టుపై 403 పరుగుల ప్రపంచ రికార్డు ఛేదన (ఆ సమయానికి)లో భాగమైన 112 పరుగుల ఇన్నింగ్స్ ఓ సంచలనం. సన్నీ (102)తో కలిసి భారత్‌కు విషీ అందించిన విజయం క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇక మద్రాస్ వేదికగా 1979లో కరీబియన్ జట్టు మీదే భారత్‌కు మరో మరపురాని విజయాన్నందించిన టెస్టులో సాధించిన శతకం (124) కూడా మేలిమి ఇన్నింగ్స్‌ల్లో ఒకటి. శతకంగా మలచలేకపోయిన ఇన్నింగ్స్‌ల్లోనూ ఆహా అనిపించినవి తక్కువేమీ కాదు. 1975లో మద్రాస్‌లోనే జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆండీ రాబర్డ్స్ నేతృత్వంలోని భీకర విండీస్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ విషీ సాధించిన 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ విజ్డన్ టాప్-100 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించింది. భారత్ 190 పరుగులకే ఆలౌటైన మ్యాచ్‌లో 50 శాతం పైగా పరుగులు విషీనే చేశాడు. ఇదే సిరీస్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో గుండప్ప సాధించిన మ్యాచ్ విన్నింగ్ సెంచరీ (139)ని కూడా నాటి అభిమానులు అంత సులువుగా మరువలేరు.
కఠిన పిచ్‌లు, భీకర బౌలర్లు ఎదురైనపుడు సహచరులంతా చేతులెత్తేసిన వేళ.. మొనగాడిలా నిలబడి గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. సొగసరి షాట్లతో అలరించడం ద్వారా అభిమానులకు అత్యంత ఇష్టమైన బ్యాటర్‌గా మారాడు విషీ. ఆండీ రాబర్ట్స్, జోయెల్ గార్నర్, మాల్కం మార్షల్, డెన్నిస్ లిల్లీ, ఇమ్రాన్ ఖాన్ లాంటి ప్రపంచ మేటి బౌలర్లందరినీ విషీ దీటుగా ఎదుర్కొన్నాడు. ఆటతో ఎంతగా అలరించాడో తన వ్యక్తిత్వంతో హుందాతనంతో అంతే ఆకట్టుకున్నాడు విషీ. మృదు స్వభావి అయిన విషీ.. ప్రత్యర్థులను పల్లెత్తు మాట అనేవాడు కాదు. తాను నాటౌట్ అయినా అంపైర్ వేలెత్తితే ఎలాంటి అసంతృప్తీ వ్యక్తం చేయకుండా వెళ్లిపోయేవాడు. అంపైర్ ఔటివ్వకున్నా.. తాను ఔటయ్యానని తెలిస్తే స్వచ్ఛందంగా క్రీజును వీడేవాడు. తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు బాబ్ టేలర్ ఔట్ కాకున్నా అంపైర్ ఔటిచ్చాడని, పెవిలియన్‌కు వెళ్తున్న అతణ్ని వెనక్కి పిలిపించి బ్యాటింగ్ కొనసాగించేలా చేసిన అరుదైన క్రికెటర్ గుండప్ప. బాబ్ ఇన్నింగ్స్ వల్ల ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అది తర్వాత విషీ కెప్టెన్సీకి కూడా ఎసరు పెట్టింది. తన చివరి పాకిస్థాన్ పర్యటనలో అంపైర్లు ఏకపక్షంగా తప్పుడు నిర్ణయాలు ప్రకటించడం కెరీర్‌కే ముగింపు పలికేలా చేసింది. కానీ మైదానంలో కానీ, బయట కానీ దాని గురించి ఎలాంటి విమర్శలూ చేయకపోవడం విషీ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే గొప్ప బ్యాటర్లలో ఒకడు, కోట్లాదిమందికి ఫేవరెట్ అయిన గావస్కర్‌కు ఎంతో ఇష్టమైన బ్యాట్స్‌మన్ గుండప్ప విశ్వనాథ్. ఆటకు తోడు గుండప్ప వ్యక్తిత్వం కూడా ఎంతో నచ్చి అతడితో కుటుంబ బంధం కలుపుకొన్నాడు సన్నీ. ముంబయివాలా అయిన సన్నీ.. కన్నడిగుడైన గుండప్పకు తన సోదరినిచ్చి వివాహం చేశాడు. గుండప్ప సోమవారం 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. సంప్రదాయ ఫార్మాట్ కళ తప్పుతున్న ఈ తరుణంలో.. ఆటతో, వ్యక్తిత్వంతో బలమైన ముద్ర వేసిన ఆ పరిపూర్ణ టెస్టు క్రికెటర్ గురించి తెలుసుకోవడానికిది మంచి సందర్భం!