సర్ఫరాజ్ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు టీమిండియాలో చోటు
దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరగున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో దీంతో చాలా కాలంగా సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ నిరీక్షణ ఫలించింది.
కాగా రెండో టెస్టుకు భారత స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమయ్యారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరు ముగ్గురు నేరుగా విశాఖపట్నంలో భారత జట్టుతో కలవనున్నారు.
కాగా గత కొంత కాలంగా సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీల్లో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 45 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 69.85 సగటుతో 3,912 రన్స్ చేశాడు. 14 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఈ ముంబైకర్ ఇండియా-ఎ జట్టు తరపున కూడా అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.
అయితే సర్ఫరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్‌కు దేశీవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‍ల్లోనే 290 వికెట్లతో సత్తాచాటాడు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరిగిన అనధికార టెస్టులో ఆరు వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు సీనియర్ జట్టుకు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.