లంక క్రికెట్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఐసీసీ.. సస్పెన్షన్ ఎత్తివేత..
శ్రీలంక క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది. గతేడాది నవంబర్‌లో శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ)పై విధించిన నిషేధాన్ని తాజాగా ఐసీసీ ఎత్తివేసింది. గత కొంతకాలంగా లంక క్రికెట్ బోర్డుపై ఓ కన్నేసి ఉంచిన ఐసీసీ.. బోర్డు తీసుకుంటున్న చర్యలపట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శ్రీలంక క్రీడా శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో లంక దారుణ వైఫల్యం నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎస్‌ఎల్‌సీ బోర్డు సభ్యులపై వేటు వేసింది. క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని ఒప్పుకునేది లేదని ఐసీసీ.. ఎస్‌ఎల్‌సీపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. నిషేధంతో లంక ఈ ఏడాది ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను కోల్పోయింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ వాస్తవానికి లంకలో జరగాల్సింది.
ఐసీసీ విధించిన నిషేధానికి వ్యతిరేకంగా లంక బోర్డు.. నవంబర్ 21న అప్పీల్ చేసుకుంది. ఈ క్రమంలో ఐసీసీ సీఈవో జెఫ్ అల్లార్డిస్.. లంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్‌సింఘేతో పాటు హరిన్ ఫెర్నాండోతో చర్చలు జరిపాడు. చర్చలతో సంతృప్తి చెందిన ఐసీసీ తాజాగా నిషేధాన్ని ఎత్తివేసింది.