సెంచరీతో చెలరేగిన పోప్.. రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు
హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. మూడో రోజు ఆటలో భారత్‌కు ధీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్.. భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. శనివారం ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 316 పరుగులు సాధించింది.
ఇంగ్లీష్ జట్టు ప్రస్తుతం 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో యువ ఆటగాడు ఓలీ పోప్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికీ పోప్ మాత్రం భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందకు నడిపిస్తున్నాడు. పోప్ ప్రస్తుతం 148 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు రెహాన్ ఆహ్మద్(16) పరుగులతో క్రీజులో ఉన్నాడు.
కాగా అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 421/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 15 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 190 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లో పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ 4 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.