సబలెంకా… మళ్లీ చాంపియన్
మెల్‌బోర్న్: బెలారస్ టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. వరుసగా రెండో ఏడాదీ మహిళల సింగిల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్ సబలెంకా 76 నిమిషాల్లో 6–3, 6–2తో చైనాకు చెందిన 12వ సీడ్ జెంగ్ కిన్‌వెన్‌పై గెలిచింది. విజేత సబలెంకాకు 31,50,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 21 లక్షలు), రన్నరప్ జెంగ్ కిన్‌వెన్‌కు 17,25,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
తొలిసెట్‌లో రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకకు ఈ సెట్ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో సెట్లోనూ రెండు బ్రేక్ పాయింట్లను సాధించిన 25 ఏళ్ల బెలారస్ స్టార్ ఈ మ్యాచ్‌లో 3 ఏస్‌లను సంధించి, 14 విన్నర్లు కొట్టింది. 14 అనవసర తప్పిదాలు చేసింది. ఒక్కసారి కూడా డబుల్‌ఫాల్ట్ చేయకుండా జాగ్రత్తగా ఆడింది. జెంగ్ 6 ఏస్‌లతో రాణించినప్పటికీ 6 డబుల్ ఫాల్ట్‌లు, 16 అనసవర తప్పిదాలతో టైటిల్‌కు దూరమైంది. గత 13 నెలల్లో ప్రతీ టోర్నీలోనూ మెరుగవుతున్న సబలెంకా జోరు ముందు ఏమాత్రం నిలువలేకపోయింది.
గత సీజన్‌లో ఆరంభ గ్రాండ్‌స్లామ్ గెలిచిన బెలారస్ అమ్మాయి ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. మధ్యలో ఫ్రెంచ్, వింబుల్డన్ ఓపెన్‌లలోనూ సెమీఫైనల్ వరకు పోరాడింది. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో సబలెంకా చేతిలోనే ఓడి ఇంటిదారి పట్టిన 21 ఏళ్ల జెంగ్ కిన్‌వెన్ ఇప్పుడు ఆమె జోరుకు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సివచ్చింది. తద్వారా మళ్లీ ఈ ఏడాదీ కొత్త సీజన్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పిన సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అజరెంకా (2012, 2013) తర్వాత వరుస టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా ఘనతకెక్కింది. 2000 తర్వాత సెట్ కోల్పోకుండా ఇక్కడ విజేతగా నిలిచిన ఐదో క్రీడాకారిణిగా సబలెంకా నిలిచింది.