హైదరాబాద్ బ్యాటర్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ..
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్‌లో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ సంచలనం సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
టీ20 మ్యాచ్ తరహాలో దంచికొడుతూ 147 బంతుల్లోనే 300 పరుగుల మార్కు అందుకుని ఈ మేరకు అరుదైన ఘనత సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 సిక్సర్లు ఉండటం విశేషం.
ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
అరుణాచల్ ప్రదేశ్‌తో అద్భుత ఇన్నింగ్స్ మెరిసిన తన్మయ్ అగర్వాల్ సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో బోర్డర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మార్కో.. ఈస్టర్న్ ప్రావిన్స్ మీద 191 బంతుల్లో 300 రన్స్ సాధించాడు. తన్మయ్ 147 బాల్స్‌లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం.
రవిశాస్త్రి పేరును చెరిపేసి..
ఇక అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లోనే అంతకుముందు తన్మయ్ అగర్వాల్ మరో రికార్డును కూడా సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.
తద్వారా 39 ఏళ్లుగా టీమిండియా మాజీ బ్యాటర్ రవిశాస్త్రి పేరిట చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 119 బంతుల్లోనే 200 పరుగుల మార్కును అందుకుని తన్మయ్ ఈ ఘనత సాధించాడు. కాగా ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్ ఆరంభమైంది.